• Sitarama-Electrical
 • Category Banner Ad
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • అర్జున్ రెడ్డి సినిమా రివ్యూ (25/8/17)

  Posted on 25 Aug, 2017 in Cinema |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (25/8/17.. 10.30am)
                 గత కొన్ని నెలలుగా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లతో బ్రహ్మాండమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న చిత్రం ‘అర్జున్ రెడ్డి’  థియేటర్లోకి వచ్చింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, షాలిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశారు. 

  కథ :
             కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని, విపరీతమైన స్వాతంత్ర్య ప్రవర్తన కలిగిన వ్యక్తిత్వం ఉన్న మెడికల్ స్టూడెంట్ అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) కాలేజ్ లో తన జూనియర్ ప్రీతి శెట్టి (షాలిని పాండే) ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్నిరోజులకు ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది. అలా ఒకరికొకరు మానసికంగా, శారీరకంగా దగ్గరైన ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ప్రీతి తండ్రి వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రీతిని వేరే వాళ్లకు ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. దాంతో మానసిక వ్యధకు గురై, పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన అర్జున్ రెడ్డిని ఇంట్లోంచి బయటికొచ్చేసి, అన్ని చెడు అలవాట్లకు బానిసై రోజు రోజుకి కుంగిపోతుంటాడు. అలాంటి సమయంలోనే అతను అమితంగా ప్రేమించే డాక్టర్ వృత్తిని కూడా వదిలేయాల్సి వస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అర్జున్ రెడ్డి మానసిక పరిస్థితి ఏంటి ? అతని ప్రవర్తన ఎలా ఉండేది ? డాక్టర్ వృత్తిని అతనెందుకు కోల్పోవాల్సి వచ్చింది ? చివరికి అతని స్వచ్ఛమైన ప్రేమ గెలిచిందా లేదా ? అనేదే ఈ సినిమా.
  ప్లస్ పాయింట్స్ :
               సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్వచ్ఛమైన ప్రేమలోని తీవ్రతను, అది విఫలమైనప్పుడు కలిగే భాధను గాఢమైన రీతిలో చెప్పడం. ప్రధాన పాత్రలైన అర్జున్ రెడ్డి, ప్రీతిల మధ్య ఉండే ప్రేమను ఆయన స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసిన విధానం కొత్తగా ఉండటమేకాక బాగుంది కూడా. సినిమా చూసిన ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు ఈ ప్రేమ కథ చాలా కాలంపాటు గుర్తుండిపోతుంది. ఇక విజయ్ దేవరకొండ పాత్ర కూడా సినిమాకు మరో ప్రధాన బలం. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని కుర్రాడిగా, ప్రేమలో విఫలమై మానసిక వ్యధను అనుభవించే ప్రేమికుడిగా విజయ్ దేవరకొండ తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. అతను కనిపించే ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉండటమేగాక ఒక ప్రత్యేకతను కూడా కలిగిఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే హీరోలోని ప్రతి అంశాన్ని ప్రేక్షకుడు అనుభవించగలడు. ఫస్టాఫ్ ఆరంభంలో హీరో కాలేజ్ రోజుల్లో నడిచే కథనంతో దగ్గర్నుండి ఇంటర్వెల్ సమయంలో అతని ప్రేమకు అడ్డంకులు ఏర్పడటం వరకు సినిమా ఆకట్టుకునే విధంగా నడిచింది. అలాగే సెకండాఫ్లో అర్జున్ రెడ్డి పడే భాధ, చెడు వ్యసనాలకు అలవాటుపడటం, వాటి మూలంగా జీవితంలో విలువైన డాక్టర్ వృత్తిని కోల్పోవడం, వాటి తాలూకు సన్నివేశాలు అన్నీ బాగున్నాయి. హీరో స్నేహితుడి పాత్ర శివ ఆద్యతం హీరోకి సపోర్ట్ చేస్తూనే మంచి ఫన్ ను అందించింది. అందులో నటించిన రాహుల్ రామకృష్ణ కూడా తెలంగాణ యాసలో మంచి టైమింగ్ తో డైలాగ్స్ చెబుతూ అలరించగా ఇతర నటులు కళ్యాణ్, కమల్ కామరాజ్ లు పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. హీరోయిన్ షాలిని కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

  మైనస్ పాయింట్స్ :
                 సినిమా సెకండాఫ్ బాగానే ఉన్నా కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలిగింది. అర్జున్ రెడ్డి ప్రీతిని మర్చిపోవడానికి చేసే కొన్ని ప్రయత్నాలు మరీ ఓవర్ గా అనిపిస్తాయి. అంతేగాక సినిమా మొత్తం ప్రేమలో విఫలమైనవాడు ఎలా కుంగిపోతాడు అనే అంశాన్ని బలంగా చూపించిన దర్శకుఢు హ్యాపీ ఎండింగ్ ఇద్దామనే ఉద్దేశ్యంతో సినిమాను ఉన్నట్టుండి ప్రేక్షకుడి మూడ్ ను తలకిందులు చేసే విధంగా ముగించడం కొంచెం డిస్టర్బ్ చేసింది. కనీసం క్లైమాక్స్ కు ముందు పాజిటివ్ ఎండింగ్ కోసం ప్రేక్షకుడ్ని ప్రిపేర్ చేసే సన్నివేశాలైనా ఉండి ఉంటే బాగుండేది.
  పైగా క్లైమాక్స్ కూడా మరీ నాటకీయంగా, ఊహాజనితంగానే ఉంది. అలాగే హీరోయిన్ హీరోతో ప్రేమలో పడటం, హీరో బాధల్లో ఉంది నాశనమైపోతున్నా కూడా దగ్గర వాలనుకోకపోవడం వంటి అంశాల వెనుక అంత బలమైన కారణాలేవీ కనబడలేదు. మరొక మైనస్ అంశమేమిటంటే దర్శకుడు కేవలం ఏ సెంటర్ ప్రేక్షకుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా తీయడంతో బి, సి ఆడియన్సుకు కథ అంతగా కనెక్ట్ కాదు.
   
   
  Be the first one to comment. Click here to post comment!