• Jaithra Business Solutions
 • Category Banner Ad
 • Jaithra Business Solutions
 • vijay opticals
 • Sitarama-Electrical
 • నేల టిక్కెట్టు సినిమా రివ్యూ (25/5/18)

  Posted on 25 May, 2018 in Cinema |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (25/5/18.. 04.30pm)
              మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’. కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

  కథ:
            చిన్నప్పటి నుండి అనాథలా పెరిగిన నేల టిక్కెట్ (రవితేజ) చుట్టూ జనం మధ్యలో మనం, జీవితంలో అందరినీ కలుపుకుని పోవాలి అనే తత్వంతో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తుంటాడు. అలా జనానికి సహాయం చేసే ప్రక్రియలో అతనికి, హోమ్ మంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు)కి మధ్యన తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఒకానొక సందర్భంలో నేల టిక్కెట్ తాను కావాలనే ఆదిత్య భూపతితో గొడవ పెటుకుంటున్నానని అంటాడు. అసలు నేల టిక్కెట్ హోమ్ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు, వారిద్దరికీ మధ్యన సంబంధం ఏమిటి, హోమ్ మంత్రి చేసిన తప్పేమిటి అనేదే తెరపై నడిచే సినిమా.

  ప్లస్ పాయింట్స్:
          రవితేజ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమాను తన భుజాలపైనే మోసే ప్రయత్నం చేశారు. ఫైట్ సీన్స్, ఫన్నీ సన్నివేశాలను బాగానే రక్తి కట్టించారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడ రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కొన్ని మంచి సన్నివేశాలను రాయడంతో అక్కడక్కడా సినిమా కొంత పర్వాలేదనిపించింది. దర్శకుడు హీరో పాత్ర ద్వారా అందరితో కలిసే ఉండాలి, మనుషులే జీవితం అనే సోషల్ మెసేజ్ ఇవ్వడం బాగుంది. ఇక సినిమా అసలు కథలోకి ప్రవేశించే ఇంటర్వెల్ సన్నివేశం బాగుంది. ఆ సన్నివేశంతో సెకండాఫ్ మీద కొంత ఆసక్తి ఏర్పడింది. ఇక మధ్య మధ్యలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, ప్రియదర్శి, అలీలు చేసిన కామెడీ పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత నవ్వించింది.

  మైనస్ పాయింట్స్ :
               ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చూస్తే అసలిది ‘సోగ్గాడే చిన్ని నాయన’ లాంటి హిట్ సినిమాను తీసిన కళ్యాణ్ కృష్ణ పనితీరేనా అనిపిస్తుంది. హీరో పాత్ర, ఇంటర్వెల్ బ్లాక్, కొన్ని ఫన్నీ సన్నివేశాలు మినహా మిగతా చిత్రం మొత్తం బోర్ కొట్టించేలా ఉంది. ఇంటర్వెల్ ముందు వరకు అసలు హీరో లక్ష్యమేమిటో బయట పడకపోవడంతో కొంత చికాకు కలగ్గా, సెకండాఫ్లో హీరో చేసే ప్రయాణం విసుగు తెప్పించింది. ప్రతి పది నిముషాలకు సినిమా ట్రాక్ మారుతూ పోతుండటంతో ఎక్కడా ప్రేక్షకుడికి కుదురుగా సినిమా చూసే ఆస్కారం కలగలేదు. కథనం ఎలాగూ బాగాలేదు కనీసం సన్నివేశాలైనా బాగున్నాయా అంటే అదీ లేదు. ప్రతి సీన్ రొటీన్ గా, సాగదీసినట్టు, కథనం మధ్యలోకి బలవంతంగా ఇరికించినట్టు ఉంది. ఇక హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ అయితే ఏమాత్రం అలరించలేకపోయింది. సినిమాలో హీరో పాత్ర, ఇంటర్వెల్ సీన్ మినహా చెప్పుకోవడానికి వేరే బలమైన పాత్రలు, సన్నివేశాలు అస్సలు కనిపించవు. సంపత్, జగపతిబాబు, పోసాని, బ్రహ్మానందం, అలీ వంటి మంచి పెర్ఫార్మలని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు దర్శకుడు. వీటన్నిటికీ తోడు మధ్యలో వచ్చే పాటలైతే అస్సలు వినదగినవిగా లేవు. సంగీతం వింటుంటే ‘ఫిధా’ సినిమాకు అద్భుతమైన సంగీతం ఇచ్చిన శక్తి కాంత్ పాటలా ఇవి అనే అనుమానం కలుగుతుంది.
   
   
  Be the first one to comment. Click here to post comment!