భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (4/6/19.. 04.30pm)
అగ్ర దేశాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ ముదురుతోంది. దీంతో రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లే చైనీయులకు డ్రాగన్ దేశం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ వేధింపులు, భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వెళ్లాలనుకునే ప్రాంతంలో భద్రతా పరిస్థితులు, చట్టాలు, నిబంధనల గురించిన పూర్తి సమాచారాన్ని ముందే తెలుసుకోవాలని సూచనలు చేసింది. వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా 15ఏళ్లలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లే చైనీయుల సంఖ్య తగ్గిపోయింది. గత ఏడాది కాలంగా ఈ ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల చైనా టెలికాం దిగ్గజం హువావేపై అమెరికా వాణిజ్య ఆంక్షలు కఠినతరం చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇదిలా ఉండగా.. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై టారిఫ్లను రెట్టింపు చేస్తూ గత నెల్లో ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు అర్ధంతరంగా ముగిశాయి.